Monday, November 06, 2006

కార్తీక సోమవారము
ఈ రోజు కార్తీక సోమవారము. ఏదో ఈ కొరియాలో నాకు తోచిన వుపవాసము వుండి, సాయంత్రం స్నానం చేసి ఓ సారి నమకంలో ఒక మూడు అనువాకాలు చదివి, వండుకుని తింటిని. అసలు ఇది ఏముంది గాని అసలు ఇవాళ ఈ బ్లాగు వ్రాయడానికి వేరే కారణం వుంది. నాకు ఎప్పుడైనా కార్తీకమాసం అనగానే గుర్తుకువచ్చేది నా చిన్నతనంలోని మా కొవ్వూరు. పశ్చిమగోదావరిజిల్లా అంచున గోదావరి తీరంలో వుంది ఈ వూరు. గోదావరి తీరాన ఇటు కొ్వ్వూరు నుంచి చూస్తే అటుప్రక్కన కనిపించి కనిపించనట్టుగా, ఎత్తైన కాగితాల ఫ్యాక్టరీ పొగ గొట్టాలతో గోదావరి తీరాన అలనాటి రాజరాజనరేంద్రుని కాలము నుండి కూడా నేనే రారాజును అన్నఠీవితో కనబడుతుంది, ప్రస్తుతము రాజమండ్రి అనబడే ఆ తూర్పుగోదావరిజిల్లా తీర పట్టణము.

నేను హైస్కూలు చదివే రోజులలో, ఎనిమిదవతరగతిలో వుండగా ఉపనయనము జరిగింది నాకు. అటుతరువాత వచ్చిన కార్తీకమాసంలో ఒక సోమవారము గుళ్ళో జరిగే అభిషేకానికి నాతోసహా మా నాన్నగారు పేరు నమోదు చేసుకున్నారు. ఈ ఊళ్ళో చాలా కష్టము సుమండి ముందుగా చేసుకోకపోతే, ఎందుకంటే వూరిలో చాలామందే వున్నారు బ్రాహ్మణులు. సరే పొద్దున్నే గోదావరి స్నానంతో మొదలు పూజా కార్యక్రమం! ఆహా ఆ అఖండ గోదావరి స్నానంలో వున్న ఆనందమే వేరు. తరువాత గుళ్ళో అభిషేకంతో అసలు పూజ మొదలు. నిజంగా ఆ వయస్సులో గర్భగుడిలో కూర్చుని అభషేకం చెయ్యడం, అదీ గుడిలోని శివలింగానికి నేరుగా, మొదట గర్వంగా అనిపించినా, ఆ పూజ పూర్తిఅయ్యేసరికి నాకు కైలాసంలోని ప్రమథ గణాలన్నీ కనబడినాయి మిట్టమధ్యహ్నం అయ్యేసరికి. సరే అప్పుడు ఇంక అందరికీ ఏదో పిండి (మన ఉప్మాలాంటిది) పెట్టారు. ఏదో మోహమాటపడుతూ సగం కడుపువరకు లాగించాను అనుకోండి అది కూడా! అప్పుడు ఇంక అదేదో లక్ష బిల్వార్చన అని మొదలు పెట్టారు. సరే అది పూర్తయ్యే సరికి సాయంత్రం అయ్యింది. హమ్మయ్య అయిపొయ్యిందిరా పరమేశ్వరా అనుకోగానే, మాళ్ళా అమ్మవారికి ఏదో పూజ. దానికి అమ్మ, అక్క కూడా వచ్చారు. బహుశా లలితాసహస్రం ఏమో, బాలాత్రిపురసుందరీ దేవికి. సరే అదీ అయ్యింది ఏడుగంటల వాల్టికి. ఏమాట కామాటే చెప్పుకోవాలిగాని ఆ గుళ్ళో వున్న అనుభూతి, ఆ ప్రకృతి రమణీయత ఎక్కడా కబడవు. సాయంత్రం నది మీదనుంచి వీచే వణికించే చల్లని మెల్లని గాలి, ఆ సమయానికి వూళ్ళోని అయ్యప్ప స్వాముల సాయంస్నానాల కోలాహలం, కుటుంబాలతో సహా తరలివచ్చే వూరిజనాల వుత్సాహము, గోదావరి నదిని చూసి మురిసిపొయ్యే చిన్నపిల్లల వికసించిన మోహాలు, అ జనాల మోహాలకు పోటీగా అన్నట్లుగా గుడి దారిలో దేదీప్యమానంగా వెలిగే మెర్క్యురి లైట్లు, విశాలమైన గుడి ప్రాంగణం ఇప్పటికీ తలచుకుంటే కలానిజమా అన్నట్లు వుంటుంది.

సరే గుడిని వదిలిపెట్టితే ఇంక అభిషేకము తరువాత ఆ సాయంత్రం ఎవరి ఇంటిలోనో ఆ రోజు గుడిలో పూజ, అభిషేకము చేసుకున్న బ్రాహ్మణులందరికీ భోజనాలుట. ఆహా అన్ని వంటలు, అదీ ఆ గోదావరి జిల్లాల ప్రత్యేకత ఐన ఆవపెట్టి చేసే పద్ధతిలో రుచిగా వండి, మడికట్టుకోని వడ్డించే మనుషులు వడ్డిస్తూ వుంటే, అసలే భోజనప్రియుడనైన నేను ఒళ్ళు తెలియకుండా తినేశా! ఇంకేముంది తిన్నాక ఒంటికంటే పొట్ట బరువైపొయ్యే! ఇక అంతే వాళ్ళ వాకిట్లోనే చతికిలబడ్డా! మా నాన్నగారు కొద్దిగా మందలించినట్టుగా కూడా గుర్తు, అంత ఒళ్ళు పై తెలియకుండా తింటే ఎలా అని. అదీగాక ఇంట్లో ఎన్నడు విస్తరిలో పదార్థాలు వదలకుండా తినడం అలవాటు .ఎక్కువైనాసరే! ఇంకా బయటవాళ్ళు అనేసరికి వాళ్ళు కొసరి కొసరి వడ్డించడం, నేను మోహమాటపడి ఎక్కువ తినెయ్యడం రెండూను. ఇంకేముంది వూపిరిపీల్చడం కాడా కష్టమైపొయ్యింది. నన్ను చూసి మా అమ్మ హడావుడి పడడం, వూళ్ళోవాళ్ళ వుచిత సలహాలు, మా నాన్నగారు నన్ను అక్కడే కొచెంసేపు కూర్చుండబెట్టి, కొంత భుక్తాయాసం తీరిన తరువాత నన్ను నెమ్మదిగా ఒక మూడు కిలోమీటర్ల దూరంలో వున్న మా ఇంటికి నడిపించుకుంటూ తీసుకువెళ్ళారు. రిక్షా ఎక్కించలేదని ఓ రెండుసార్లు నేను మా నాన్నని తిట్టుకోని వుండే వుంటాను కూడా! ఎలాగైతేనేమి ఇంటికి వెళ్ళేసరికి మామూలు మనషినయ్యా! ఇప్పటికి నాకు మా నాన్నగారి చిట్కాలు, ఆయన సమయోచిత నిర్ణయాలు చాలా వరకు అప్పట్లో అర్థంకాకున్నా, తిట్టుకున్నా, ఇప్పుడు ఆలోచిస్తే ఆయన ఎంత సరియైన నిర్ణయాలు చేసేవారో అర్థమవుతుంది.

అదండీ మరి నా కార్తీకసోమవారం కథ. :-)

2 Comments:

Anonymous Anonymous said...

KK garu, telugu font lO javAbu vrAyananduku kshaminchAli.

chinna tanamlOnE pUjalaki, abhishEkAlaki parichayam chEsina mI nAnnagAriki chAlA mundu chUpu vunDi vunTundi. mIru korea lO vunna, mI manassu, sivabhishEkam chEsi vachEsindi lEnDi.

jaya jaya Sankara!

7:34 AM  
Anonymous Anonymous said...

బాగుంది నీ భుక్తాయాస ప్రహసనం

7:53 PM  

Post a Comment

<< Home