Thursday, April 24, 2008

ప్రొద్దున లేవగానే మా నాన్నగారు పెట్టే రేడియో భక్తిరంజనిలో నాకు సూర్యభగవానుడిని స్తుతించే ఈ పాట చాలా యిష్టం. అందుకే తెలుగులో నా బ్లాగులో పెడితే అందరికీ అందుబాటులో వుంటుందని చిన్న ప్రయత్నం.

శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ || 2 ||

పొడుస్తూ భానుడూ పొన్న పువ్వు ఛాయ
పొన్నపువ్వు మీద పొగడపువ్వు ఛాయ ||శ్రీ సూర్య ||

ఉదయిస్తూ భానుడు ఉల్లిపువ్వు ఛాయ
ఉల్లిపువ్వుమీద ఉగ్రంపు పొడిఛాయ ||శ్రీ సూర్య ||

గడియెక్కి భానుడు కంబపువ్వు ఛాయ
కంబపువ్వు మీద కాకారీ పూఛాయ||శ్రీ సూర్య||

జామెక్కి భానుడు జాజిపువ్వు ఛాయ
జాజిపువ్వుమీద సంపంగీ పూఛాయ||శ్రీ సూర్య||

మధ్యాహ్న భానుడు మల్లెపువ్వు ఛాయ
మల్లెపువ్వుమీద మంకెన్న పూఛాయ||శ్రీ సూర్య||

మూడుఝాముల భానుడు ములగపువ్వు ఛాయ
ములగపువ్వుమీద ముత్యంపు పొడిఛాయ||శ్రీ సూర్య||

అస్తమాన భానుడు ఆవపువ్వు ఛాయ
ఆవపువ్వుమీద అద్దంపు పొడిఛాయ||శ్రీ సూర్య||

వాలుతూ భానుడు వంగపువ్వు ఛాయ
వంగపువ్వుమీద వజ్రంపు పొడిఛాయ||శ్రీ సూర్య||

గుంకుతూ భానుడు గుమ్మడిపూఛాయ
గుమ్మడిపువ్వుమీద కుంకంపు పొడిఛాయ||శ్రీ సూర్య||

ఈ పాట ఆడియో ఇక్కడ లభ్యమవుతుంది.
http://indianmelodyonline.com/Music/Devotional/r/AadityaHrudayam/03_Meluko_Hari_Surya.mp3


Key Words: Sri suryanarayana, meluko hari suryanarayana

Monday, November 06, 2006

కార్తీక సోమవారము
ఈ రోజు కార్తీక సోమవారము. ఏదో ఈ కొరియాలో నాకు తోచిన వుపవాసము వుండి, సాయంత్రం స్నానం చేసి ఓ సారి నమకంలో ఒక మూడు అనువాకాలు చదివి, వండుకుని తింటిని. అసలు ఇది ఏముంది గాని అసలు ఇవాళ ఈ బ్లాగు వ్రాయడానికి వేరే కారణం వుంది. నాకు ఎప్పుడైనా కార్తీకమాసం అనగానే గుర్తుకువచ్చేది నా చిన్నతనంలోని మా కొవ్వూరు. పశ్చిమగోదావరిజిల్లా అంచున గోదావరి తీరంలో వుంది ఈ వూరు. గోదావరి తీరాన ఇటు కొ్వ్వూరు నుంచి చూస్తే అటుప్రక్కన కనిపించి కనిపించనట్టుగా, ఎత్తైన కాగితాల ఫ్యాక్టరీ పొగ గొట్టాలతో గోదావరి తీరాన అలనాటి రాజరాజనరేంద్రుని కాలము నుండి కూడా నేనే రారాజును అన్నఠీవితో కనబడుతుంది, ప్రస్తుతము రాజమండ్రి అనబడే ఆ తూర్పుగోదావరిజిల్లా తీర పట్టణము.

నేను హైస్కూలు చదివే రోజులలో, ఎనిమిదవతరగతిలో వుండగా ఉపనయనము జరిగింది నాకు. అటుతరువాత వచ్చిన కార్తీకమాసంలో ఒక సోమవారము గుళ్ళో జరిగే అభిషేకానికి నాతోసహా మా నాన్నగారు పేరు నమోదు చేసుకున్నారు. ఈ ఊళ్ళో చాలా కష్టము సుమండి ముందుగా చేసుకోకపోతే, ఎందుకంటే వూరిలో చాలామందే వున్నారు బ్రాహ్మణులు. సరే పొద్దున్నే గోదావరి స్నానంతో మొదలు పూజా కార్యక్రమం! ఆహా ఆ అఖండ గోదావరి స్నానంలో వున్న ఆనందమే వేరు. తరువాత గుళ్ళో అభిషేకంతో అసలు పూజ మొదలు. నిజంగా ఆ వయస్సులో గర్భగుడిలో కూర్చుని అభషేకం చెయ్యడం, అదీ గుడిలోని శివలింగానికి నేరుగా, మొదట గర్వంగా అనిపించినా, ఆ పూజ పూర్తిఅయ్యేసరికి నాకు కైలాసంలోని ప్రమథ గణాలన్నీ కనబడినాయి మిట్టమధ్యహ్నం అయ్యేసరికి. సరే అప్పుడు ఇంక అందరికీ ఏదో పిండి (మన ఉప్మాలాంటిది) పెట్టారు. ఏదో మోహమాటపడుతూ సగం కడుపువరకు లాగించాను అనుకోండి అది కూడా! అప్పుడు ఇంక అదేదో లక్ష బిల్వార్చన అని మొదలు పెట్టారు. సరే అది పూర్తయ్యే సరికి సాయంత్రం అయ్యింది. హమ్మయ్య అయిపొయ్యిందిరా పరమేశ్వరా అనుకోగానే, మాళ్ళా అమ్మవారికి ఏదో పూజ. దానికి అమ్మ, అక్క కూడా వచ్చారు. బహుశా లలితాసహస్రం ఏమో, బాలాత్రిపురసుందరీ దేవికి. సరే అదీ అయ్యింది ఏడుగంటల వాల్టికి. ఏమాట కామాటే చెప్పుకోవాలిగాని ఆ గుళ్ళో వున్న అనుభూతి, ఆ ప్రకృతి రమణీయత ఎక్కడా కబడవు. సాయంత్రం నది మీదనుంచి వీచే వణికించే చల్లని మెల్లని గాలి, ఆ సమయానికి వూళ్ళోని అయ్యప్ప స్వాముల సాయంస్నానాల కోలాహలం, కుటుంబాలతో సహా తరలివచ్చే వూరిజనాల వుత్సాహము, గోదావరి నదిని చూసి మురిసిపొయ్యే చిన్నపిల్లల వికసించిన మోహాలు, అ జనాల మోహాలకు పోటీగా అన్నట్లుగా గుడి దారిలో దేదీప్యమానంగా వెలిగే మెర్క్యురి లైట్లు, విశాలమైన గుడి ప్రాంగణం ఇప్పటికీ తలచుకుంటే కలానిజమా అన్నట్లు వుంటుంది.

సరే గుడిని వదిలిపెట్టితే ఇంక అభిషేకము తరువాత ఆ సాయంత్రం ఎవరి ఇంటిలోనో ఆ రోజు గుడిలో పూజ, అభిషేకము చేసుకున్న బ్రాహ్మణులందరికీ భోజనాలుట. ఆహా అన్ని వంటలు, అదీ ఆ గోదావరి జిల్లాల ప్రత్యేకత ఐన ఆవపెట్టి చేసే పద్ధతిలో రుచిగా వండి, మడికట్టుకోని వడ్డించే మనుషులు వడ్డిస్తూ వుంటే, అసలే భోజనప్రియుడనైన నేను ఒళ్ళు తెలియకుండా తినేశా! ఇంకేముంది తిన్నాక ఒంటికంటే పొట్ట బరువైపొయ్యే! ఇక అంతే వాళ్ళ వాకిట్లోనే చతికిలబడ్డా! మా నాన్నగారు కొద్దిగా మందలించినట్టుగా కూడా గుర్తు, అంత ఒళ్ళు పై తెలియకుండా తింటే ఎలా అని. అదీగాక ఇంట్లో ఎన్నడు విస్తరిలో పదార్థాలు వదలకుండా తినడం అలవాటు .ఎక్కువైనాసరే! ఇంకా బయటవాళ్ళు అనేసరికి వాళ్ళు కొసరి కొసరి వడ్డించడం, నేను మోహమాటపడి ఎక్కువ తినెయ్యడం రెండూను. ఇంకేముంది వూపిరిపీల్చడం కాడా కష్టమైపొయ్యింది. నన్ను చూసి మా అమ్మ హడావుడి పడడం, వూళ్ళోవాళ్ళ వుచిత సలహాలు, మా నాన్నగారు నన్ను అక్కడే కొచెంసేపు కూర్చుండబెట్టి, కొంత భుక్తాయాసం తీరిన తరువాత నన్ను నెమ్మదిగా ఒక మూడు కిలోమీటర్ల దూరంలో వున్న మా ఇంటికి నడిపించుకుంటూ తీసుకువెళ్ళారు. రిక్షా ఎక్కించలేదని ఓ రెండుసార్లు నేను మా నాన్నని తిట్టుకోని వుండే వుంటాను కూడా! ఎలాగైతేనేమి ఇంటికి వెళ్ళేసరికి మామూలు మనషినయ్యా! ఇప్పటికి నాకు మా నాన్నగారి చిట్కాలు, ఆయన సమయోచిత నిర్ణయాలు చాలా వరకు అప్పట్లో అర్థంకాకున్నా, తిట్టుకున్నా, ఇప్పుడు ఆలోచిస్తే ఆయన ఎంత సరియైన నిర్ణయాలు చేసేవారో అర్థమవుతుంది.

అదండీ మరి నా కార్తీకసోమవారం కథ. :-)

Wednesday, November 01, 2006

పోతన భాగవతము

లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం
జులతా శోభితమున్ సువర్ణసుమనస్సుజ్ఞీయమున్ సుందరో
జ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు వుర్విన్ సద్విజ శ్రేయమై.


ఇక్కడ మహాభాగవతాన్ని కల్పవృక్షంతో పోల్చి చూపిస్తున్నాడు పోతన మహాకవి. లలిత స్కంధము అంటే మనోహరమైన విభాగాలు కలది అని భాగవతపరంగా అలాగే వృక్షపరంగా లలితనైన స్కంధములు కలది అని. విశేషణాలు వుభయాన్వయంగా, అటు మహాభారతానికి యిటు కల్పవృక్షానికి కూడా పొందుపరచడం జరిగింది. కృష్ణ మూలము, ధృఢమైన మూలము వృక్షపరంగా, శ్రీకృష్ణ పరమాత్ముడే మూలము యిందులో భాగవతపరంగా! శుకాలాపాభిరామంబు, శుకపిక పక్షుల కలకలారావములతో మధురంగావున్నదిట వృక్షము, ఐతే శుకమహర్షి ఆలాపంచేత, ఆయన చెప్పటం చేత ఇది మధుర మధురాయమానము అంటున్నాడు మహాభాగవతపరంగా! మంజులతాశోభితమున్, మంజులత్వముచేత శోభించేది మహభాగవతము, మనోహరమైనటువంటి తీగల చేత అల్లుకొన్నది కల్పవృక్షము. సువర్ణసుమనస్సుజ్ఞీయమున్, సువర్ణములు అనగా మంచి అక్షరములు కలది మహాభాగవతము, సుమనస్సులు అంటే దేవతలు. దేవతలకు కూడా తెలుసుకోదగినదిగా వున్నది మహాభాగవతము. కల్పవృక్షపరంగా, మంచి రంగులు కలిగి, సుమనస్సులు అంటే, మంచి పుష్పములతో అలరారుతున్నది అని అర్థము. సుందరోజ్వలవృత్తము, సుందరమైన ఉజ్వలమైన వృత్తాంతము కలది శ్రీమహాభాగవతము, సుందర వుజ్వలమైన వృత్తము అనగా చుట్టుకొలత కలది ఆ కల్పవృక్షము. మహాఫలంబు, మోక్షమే ముక్తియే ఫలంగా కలది ఈ మహాభాగవతము, ఐతే మహాఫలములతో శోభిల్లుచున్నది కల్పవృక్షము. విమల వ్యాసాలవాలంబునై, విమలమైన విస్తారమైన వ్యాసమైన ఆలవాలము కలిగినటువంటిది ఆ కల్పవృక్షము, ఐతే మహాభాగవతము వ్యాసుడే పవిత్రమైనటువంటి మనస్సుతో వ్యాసుడే ఆలవాలముగా మూలముగా కల్గినటువంటిది ఇది. వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు, భాగవతము అనే పేరుగల ఈ కల్పవృక్షము శోభిల్లుగాక! ఉర్విన్ సద్విజశ్రేయమై, ద్విజములు అంటే పక్షులు, కల్పవృక్షము పక్షులకు సమాశ్రయముగా వున్నదిట, సద్విజః అంటే వేదాంతులు, విజ్ఞానవేత్తలు, బ్రాహ్మణులు, విద్వాంసులైన వారికి, ఎవరైతే మోక్షార్థులై వున్నారో, మోక్ష సంకల్పార్థులై వున్నారో అటువంటివారికి శ్రేయోదాయకమై, మోక్షఫలప్రదాయకమై ఈ మహాభాగవతం వెలయు చున్నది అన్నాడు. ఇదీ లలిత స్కంధము కృష్ణమూలము ఐన మహాభాగవత కల్పవృక్షము.

ఆహా! ఎంత సుమధురమో గదా అ పోతనగారి భాగవతము.

ఈ వ్యాఖ్యానము www.teluguone.com/bhakti లో నాగఫణిశర్మగారిచే చేయబడినది. చాలా బాగుంది ఆయన వ్యాఖ్యానము.

Sunday, August 27, 2006

వినాయక చవితి

పండగలు అనగానే మొదట గుర్తుకు వచ్చేది ఇల్లే ఇవరికైనా! పండగ ఇంట్లోవాళ్ళతో చేసుకోవడంలో వున్న ఆనందం యేమైనా వేరు. ఎలాగైతే నేమి కష్టపడి వినాయక చవితి చేశాను ఇవాళ! ఛ కష్టపడి ఎందుకో....సొంతపొట్ట కోసం చేసుకుని ఎవడినో వుధ్ధరించిన పోజు!

సరే చెసిన తీరు ఎట్టిదనగా నిన్న రాత్రి ఆలస్యంగా పొడుకున్న కారణంగా పొద్దున్న లేచేసరికి 7.50. అప్పటికీ రాత్రి ఆరున్నరకి అలారం పెట్టి యేడ్చాను కాని ఏమి వుపయోగం! కుక్కతోక వంకర.....సరే రెండు సార్లు నన్ను నేను తిట్టుకొని తయారుకావడానికి పరుగెట్టాను. మా రూమ్ మేట్ ని లేపి మిగతాపనులకు పురమాయించి, నేను స్నానం చేసేసరికి 8.45. నాకు సెలవురోజు ఖాళీగా కూర్చొని కాఫీ తాగడం మహా యిష్టం. సరే ముందున్న పెద్దపనికి ఒకింత వుత్సాహం అవసరమని పాలు కాచి తీరికగా 9 వరకు కాఫీ జుర్రి, యిక వంటకి సిధ్ధమయ్యా! వంటలోకి వంకాయ కూర, గెన్సిగడ్డల పులుసు, పరమాన్నం, బజ్జీలు (బీరకాయ, బంగాళదుంప) యింకా చింతపండు పులిహోర. తొమ్మిదింటికి మొదలు పెట్టిన వంట పదకండున్నర వరకు సాగింది. వినాయకుడి అద్రుష్టం, వంటలన్నీ బాగానే కుదిరినాయి.

సరే యింక ముఖ్యఘట్టం పూజ. నేను తెచ్చుకున్న సిల్కు ధోవతిని కట్టి, ఏదో నేను నిన్న మా కంపెనీలో తీసిన పూజ printout పట్టుకుని మొదలుపెట్టా! ఏమిటో నా బొంద పూలు లేని పూజ! ఏమి చేస్తాం అని ఒకసారి మనస్సులో బావురుమని, అక్షింతలే పూలు అనుకుని పూజ మొదలు పెట్టా! దాగ్గర దీపం పెట్టడానికి యేమిలేవు. సరే అంతమాత్రాన దీపం పెట్టలేమా అని కార్తీకమాసంలో మన ముత్తయిదువులు గుళ్ళల్లో వెలిగించే దీపాలను గుర్తుచేసుకుని కాస్త బియ్యపు పిండితొ ఒక ప్రమిద తయారు చేసా! ఇక దానిలోకి వత్తి కోసం నేను Inida నుంచి వచ్చేటప్పుడు తెచ్చిన ఒక బ్రహ్మచారి జంధ్యాన్ని కత్తిరించి ఓ రెండు వత్తులు చేసా. ఇక దేవుడికి దీపం ready. సరే ఇంక పూజ పూర్తయ్యేసరికి సుమారుగా ఒంటిగంట. ఎలాగైతేనేమి 12 లోపల పూజ మొదలుపెట్టా శాస్త్రవిధికి విరుద్ధం కాకుండా! వినాయకుడిని కూడా పిండితో చెద్దామని అనుకున్నాగాని సమయాభావం వల్ల కుదరలేదు. సరే వచ్చే సంవత్సరం చూద్దామని వదిలేసా!

అది నా వినాయక చవితి ఈ సంవత్సరానికి. ఇక వంట విషయానికి వస్తే బజ్జీలు నూనెను ఒక రకంగా తాగినాయి. దీని నివారణోపాయం కనుక్కోవాలి మా అక్కనో అమ్మనో!

Saturday, August 05, 2006

హ్.......ఏమిటో నాకు ఒక రోజు వున్న ఉత్సుకత ఇ౦కొక రోజుకి వు౦డదు. ఏ పనిని రె౦డు రోజుల కన్న ఎక్కువ చెయ్యలేను. కాని అలా అలా మళ్ళి తిరిగి అక్కడికే వస్తాను. ఎ౦దుక౦టే నాకు మొదలు పెట్టిన పనిని మధ్యలో వదిలిపెట్టడ౦ ఇష్ట౦ ఉ౦డదు. కాని ఎ౦దుకో ఈ బ్లాగడ౦ అనవసరమేమో అని, ఇ౦కా చెప్పాల౦టే ఇలా సొ౦త డబ్బా వేసుకోవడ౦ ఎబ్బెట్టుగా అనిపిస్తు౦ది. సరి సరి! ఇప్పటికి ఇలా కానిచ్చెదను. మ౦చికో చేడుకో నాకు విసుగు రాకు౦డా అప్పుడప్పుడు ఇదొక కాలక్షేప౦!


అరే విసుగు అని వ్రాసి౦ది ఒకసారి చదవగానే ఒక విషయ౦ గుర్తుకు వచ్చి౦ది. అదే నా విసుగు! నా విసుగుకు ఒక అర్థ౦ పర్ధ౦ కనపడదు. నేను పాప౦ పుట్టుకతోనే అ౦త! చిన్నప్పుడు మా అమ్మ దగ్గర ఏమీ తోచక నస పేట్టేవాడిని. ఏమిటోగా వు౦దే అని విసిగి౦చేవాడిని. బహుశా అది ఐదారేళ్ల వయస్సు కావచ్చు. పాప౦ మా అమ్మకు అర్థ౦ అయ్యేది కాదనుకు౦టా! నా చిన్ని మెదడు కొ౦చె౦ గ(అ)తి ఎక్కువని దానికి ఎప్పుడు ఏదో ఒక పని కల్పి౦చక పోతే అది నన్ను పిచ్చి వాడిని చేస్తు౦దనీ! విసుక్కోని తిట్టేది. పాప౦ ఏమి చేస్తు౦ది తను మాత్ర౦. ముగ్గురు పిల్ల పిశాచుల౦. ఒకరి తరువాత ఒకళ్ళ౦ వరుసగా! కొన్నాళ్ళ తరువాత నేనే ఏదో ఒకటి పట్టుకోని దానిని విరగదీసో వూడదీసో దానిని చూసి దాని పని చేసే విధాన౦ కనిపెట్టి ఆన౦ది౦చేవాడిని. దానితో నాకొక పెద్ద నాశన౦ గాడు అన్న బిరుదు తగిలి౦చారు అనుకో౦డి! అది వేరే విషయ౦. ఇ౦టిలో టార్చి లైటు, పెన్నులు, రేడియోలు నా ను౦చి కాపాడుకొనేవాళ్ళు పాప౦, నేను ఎక్కడికి వెళ్ళినా! చుట్టాలి౦టికి వెళ్ళినా చెయ్యి తిన్నగా వూరుకు౦డేది కాదు. కొత్త వాళ్ళు అయితే తటపటాయి౦చేవాడిని కాని, అమ్మమ్మ గారి ఇల్లో లేక ఇటు తాతగారి ఇల్లో అయితే జనాలు నా దెబ్బకు దడుచుకొనేవాళ్ళు. అయితే కొన్నాళ్ళకు వాళ్ళకు ఒక విషయ౦ అర్థమై౦ది. నాశన౦ చెయ్యడమే కాదు బాగు చెయ్యడ౦ కూడా నాకు తెలుసునని! ఏదన్నా టార్చిలైటు లా౦టి వస్తువులని అవతల పారవేశే ము౦దు నా చేతిలో పెట్టేవాళ్ళు. దాని స౦గతి ఒకసారి చూడమని! బాగుపడితే సరి! లేకపోతే చెత్తకుప్పే దాని గతి!


అప్పట్లో ప్రెస్సి౦గు బాల్ పాయి౦ట్ పెన్నులు కొత్త. మా నాన్న మాకు ముచ్చట పడి ముగ్గురికి మూడు పెన్నులు తెచ్చేవాళ్ళు. మా అక్క, తమ్ముడు వాటిని జాగ్రత్తగా దాచుకునేవాళ్ళు. అపురూప౦గా వాడుకునేవాళ్ళు. నేను మాత్ర౦ దానిని తేగానే అటు ఇటు తిప్పి అదో రక౦గా చూసేవాడినట! మా నాన్నకు వళ్ళు మ౦డేదట! తెచ్చిన రోజు మా నాన్నకు భయపడి విప్పతీసి చూడక పొయినా, ఆ రోజు రాత్రి అ౦దరూ నిద్ర పొ్యిన తరువాతైనా దానిని విప్పతీసి చూసేవాడినని మా అమ్మ ఇప్పటికీ చెభుతు౦ది. నిజమే చూసేవాడినో లేదో నాకైతే తెలియదు కాని నాకు పదవ తరగతి వరకు ఆ పెన్నులు ఒక పెద్ద వి౦త! అది ఎలా పనిచేస్తో౦దో తెలుసుకోవడానికి నేను ఏ అవకాశాన్ని జారవిడువలేదు. నేను దానిని అర్ధ౦ చేసుకొనేసరికి ఎన్ని పెన్నులు నా చేతిలో నాశన౦ అయ్యాయో లెక్కే లేదు.

Thursday, August 03, 2006

నేను ఎన్నాళ్ళుగానో అనుకు౦టున్న నా తెలుగు బ్లాగు....చూద్దా౦ ఇది ఆర౦భశూరత్వమో లేక అశ్వత్థ వృక్షమో....!