పోతన భాగవతము
లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం
జులతా శోభితమున్ సువర్ణసుమనస్సుజ్ఞీయమున్ సుందరో
జ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు వుర్విన్ సద్విజ శ్రేయమై.
ఇక్కడ మహాభాగవతాన్ని కల్పవృక్షంతో పోల్చి చూపిస్తున్నాడు పోతన మహాకవి. లలిత స్కంధము అంటే మనోహరమైన విభాగాలు కలది అని భాగవతపరంగా అలాగే వృక్షపరంగా లలితనైన స్కంధములు కలది అని. విశేషణాలు వుభయాన్వయంగా, అటు మహాభారతానికి యిటు కల్పవృక్షానికి కూడా పొందుపరచడం జరిగింది. కృష్ణ మూలము, ధృఢమైన మూలము వృక్షపరంగా, శ్రీకృష్ణ పరమాత్ముడే మూలము యిందులో భాగవతపరంగా! శుకాలాపాభిరామంబు, శుకపిక పక్షుల కలకలారావములతో మధురంగావున్నదిట వృక్షము, ఐతే శుకమహర్షి ఆలాపంచేత, ఆయన చెప్పటం చేత ఇది మధుర మధురాయమానము అంటున్నాడు మహాభాగవతపరంగా! మంజులతాశోభితమున్, మంజులత్వముచేత శోభించేది మహభాగవతము, మనోహరమైనటువంటి తీగల చేత అల్లుకొన్నది కల్పవృక్షము. సువర్ణసుమనస్సుజ్ఞీయమున్, సువర్ణములు అనగా మంచి అక్షరములు కలది మహాభాగవతము, సుమనస్సులు అంటే దేవతలు. దేవతలకు కూడా తెలుసుకోదగినదిగా వున్నది మహాభాగవతము. కల్పవృక్షపరంగా, మంచి రంగులు కలిగి, సుమనస్సులు అంటే, మంచి పుష్పములతో అలరారుతున్నది అని అర్థము. సుందరోజ్వలవృత్తము, సుందరమైన ఉజ్వలమైన వృత్తాంతము కలది శ్రీమహాభాగవతము, సుందర వుజ్వలమైన వృత్తము అనగా చుట్టుకొలత కలది ఆ కల్పవృక్షము. మహాఫలంబు, మోక్షమే ముక్తియే ఫలంగా కలది ఈ మహాభాగవతము, ఐతే మహాఫలములతో శోభిల్లుచున్నది కల్పవృక్షము. విమల వ్యాసాలవాలంబునై, విమలమైన విస్తారమైన వ్యాసమైన ఆలవాలము కలిగినటువంటిది ఆ కల్పవృక్షము, ఐతే మహాభాగవతము వ్యాసుడే పవిత్రమైనటువంటి మనస్సుతో వ్యాసుడే ఆలవాలముగా మూలముగా కల్గినటువంటిది ఇది. వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు, భాగవతము అనే పేరుగల ఈ కల్పవృక్షము శోభిల్లుగాక! ఉర్విన్ సద్విజశ్రేయమై, ద్విజములు అంటే పక్షులు, కల్పవృక్షము పక్షులకు సమాశ్రయముగా వున్నదిట, సద్విజః అంటే వేదాంతులు, విజ్ఞానవేత్తలు, బ్రాహ్మణులు, విద్వాంసులైన వారికి, ఎవరైతే మోక్షార్థులై వున్నారో, మోక్ష సంకల్పార్థులై వున్నారో అటువంటివారికి శ్రేయోదాయకమై, మోక్షఫలప్రదాయకమై ఈ మహాభాగవతం వెలయు చున్నది అన్నాడు. ఇదీ లలిత స్కంధము కృష్ణమూలము ఐన మహాభాగవత కల్పవృక్షము.
ఆహా! ఎంత సుమధురమో గదా అ పోతనగారి భాగవతము.
ఈ వ్యాఖ్యానము www.teluguone.com/bhakti లో నాగఫణిశర్మగారిచే చేయబడినది. చాలా బాగుంది ఆయన వ్యాఖ్యానము.
0 Comments:
Post a Comment
<< Home